![]() |
![]() |

గత దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు పఠాన్ చిత్రంతో విజయ బావుటా ఎగురవేశారు. మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 1000కోట్ల మార్కును దాటుతుందా? లేదా? అనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ఈజీగా ఆ మార్కును చేరుకుంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. కాగా 'పఠాన్' సాధించిన ఘన విజయం వల్ల షారుక్ నటిస్తున్న తదుపరి చిత్రం 'జవాన్'కు భారీ స్థాయిలో లాభం చేకూరింది.
ఒక హీరో నటించిన చిత్రం భారీ విజయం సాధిస్తే అది తదుపరి విడుదలయ్యే చిత్రానికి మార్కెట్, బిజినెస్ పరంగా మంచి లాభం చేకూరుస్తుంది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న 'జవాన్' చిత్రం బిజినెస్ 'పఠాన్' చిత్రానికి ముందు, 'పఠాన్' చిత్రం విడుదల తర్వాత అన్న విధంగా మారిపోయిందట. 'పఠాన్' ముందు వరకు ఈ సినిమాకు ఉన్న బిజినెస్ కంటే 'పఠాన్' చిత్రం విడుదలైన తరువాత ఈ చిత్రం బిజినెస్ 100 కోట్లు అదనంగా జరిగిందని సమాచారం.
ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ అతిధి పాత్రను పోషిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ చిత్రంతో నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. వీటన్నిటిని పరిగణనలోకి చూసుకుంటే పఠాన్ చిత్రం కంటే దక్షిణాదిలో జవాన్ చిత్రానికి ఉండే వెయిట్ ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతూ ఉండటంతో ఈ మూవీలో సౌత్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ముఖ్యంగా తమిళనాట పఠాన్ కంటే జవాన్ చిత్రం రెట్టింపు వసూళ్లను నమోదు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విధంగా పఠాన్ సక్సెస్ జవాన్ చిత్రానికి లాభాల పంటను పండించిందని, అదనపు లాభాన్ని చేకూర్చి పెట్టిందని, ఏకంగా 100 కోట్లను గిఫ్ట్ గా అందించిందని చెప్పుకోవచ్చు.
![]() |
![]() |